Thursday, July 9, 2020

ఇంటిని అమ్మి.. స్కూలు నిర్మించి ...


పేదరికం ఎంతోమందికి విద్యను అందకుండా చేస్తోంది. కానీ, చదువు అనేది జాతి, కుల, మత, లింగ బేధం లేకుండా అందరికీ అందాలి. ఆ సంకల్పంతోనే... 25 ఏళ్లు విద్యారంగంలో పనిచేసిన సునీతా జీవన్‌ కులకర్ణి (70) పేద విద్యార్థులకు విద్యను అందించాలనుకున్నారు. పూణేలోని కొంధ్వా ప్రాంతపు పిల్లల కోసం తమ ఇంటిని అమ్మి... వచ్చిన డబ్బుతో 'వ్యాలీ వ్యూ హై' స్కూలును ప్రారంభించారు.

కొంధ్వా జనాభాలో ఎక్కువమంది రోజువారీ కూలీలు, కాంట్రాక్టు కార్మికులు నివాసం ఉంటారు. అందువల్ల, ఈ ప్రాంతంలోని చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. విద్య అనేది ప్రజల్ని శక్తివంతంగా చేసే సాధనాల్లో మొదటిది. నిరుపేద, అట్టడుగున ఉండేవారికి తక్కువ ఖర్చుతో చదువును అందించాలని 1996లో 'వ్యాలీ వ్యూ హై' స్కూలును ప్రారంభించారు సునీత. తొలుత ఎనిమిది మంది విద్యార్థులతో ఈ స్కూలు మొదలైంది! నేడు, ఆ సంఖ్య 900 మంది బాలురు, 600 మంది బాలికలతో మొత్తం 1500కి చేరింది.
మన దేశంలో చాలామంది పిల్లలు, వారి కుటుంబాల ఆర్థికస్థితి కారణంగా చదువుకోలేక పోతున్నారు. ఓ సర్వే ప్రకారం, 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న 20 కోట్ల మంది పిల్లలలో, 5 కోట్ల మందికిపైగా పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలను కున్నారు సునీత. ''నేనొక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అయినా చదువుపై ఉన్న శ్రద్ధతో చదువుకున్నాను. నా వంటి వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసమే నా ఈ ప్రయత్నం'' అంటున్నారు సునీత.
పాఠశాలను ప్రారంభించడానికి ఆమె ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొన్నారు. 'నాకు ఒక ఫ్లాట్‌ ఉంది. నా భర్త ఇచ్చిన సలహా మేరకు దానిని అమ్మేసి వచ్చిన డబ్బుతో 500 చదరపు అడుగుల స్థలాన్ని కొన్నాను. తొలుత రెండు తరగతి గదులు నిర్మించాం. ఆ తర్వాత ప్రతి ఏడాది రెండు గదులు చొప్పున పెంచుకుంటూ వెళ్లాం. దాతల విరాళాలు, బ్యాంక్‌ రుణం ఇందుకోసం ఉపయోగించాం.'' అని వివరించారు.
ఈ పాఠశాలలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్‌ చేసుకునే సమయంలో తల్లిదండ్రుల ఆదాయం, వత్తి వివరాలను సేకరిస్తారు. నెలవారీ ఫీజు రూ.500 - 600 వరకు తీసుకుంటారు. విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడం కోసం ప్రత్యేకంగా సిలబస్‌ను ూుజువీ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం) పద్ధతిలో తయారు చేశారు. క్రీడలు, శారీరక శిక్షణను అందిస్తున్నారు. పాఠశాలలో 70 మంది బోధనా సిబ్బంది, ఇంకా ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ పాఠశాలలో పర్యావరణ సమస్యలపైనా, తీసుకోవాల్సిన జాగ్రత్తల పైనా అవగాహనను కల్పిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా క్లాస్‌రూమ్‌ తరగతులకు బదులు అన్ని పాఠాలను ఆన్‌లైన్‌లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు లేని పేద విద్యార్థులకు వాటిని అందించడం కోసం స్పాన్సర్‌షిప్‌ను పొందారు. వచ్చే రెండు మూడు నెలల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్య అందిస్తామని అంటున్నారు సునీత.

వ్యాధి నిరోధకత పెరగాలంటే ..?

కరోనా మహమ్మారి వైరస్‌తో యుద్ధం చేయాలంటే... మన శరీరంలోని రోగనిరోధక శక్తిని తప్పక పెంచుకోవాలి. అయితే, రోగనిరోధక శక్తి ఒక్కసారిగా పెరగటం అసాధ్యం. నలభై రోజుల పాటు క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
అనారోగ్య సమస్యల నుంచి బయట పడటానికి ప్రధానంగా విటమిన్‌ 'సి' తోడ్పడుతుంది. సాధారణ జలుబును సైతం సిట్రిక్‌ దూరం చేస్తుంది. యాంటీ ఫంగల్‌, క్రిమినాశక, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో నిమ్మ ఎంతో తోడ్పడుతుంది. 'సి' విటమిన్‌ ఉన్న ఏ పండైనా రోజుకు ఒకటి తీసుకోవడం ఎంతో శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థను పెంచుకోవచ్చు.
వెల్లుల్లిలో విటమిన్‌ 'ఏ', జింక్‌, సల్ఫర్‌, సెలీనియమ్‌లు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. జీర్ణ సమస్యలున్న వారు ప్రతి నిత్యం ఆహారంలో పచ్చి లేక ఉడకబెట్టిన వెల్లుల్లిని తినడం వల్ల కొద్ది రోజుల్లోనే సమస్య అదుపులోకి వస్తుంది. పచ్చి వెల్లుల్లి రెండు రెబ్బలు తింటే పొట్ట పాడవకుండా ఉంటుంది. రోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు, దగ్గును దరి చేరనివ్వదు. మొత్తంగా వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్‌ ఫుల్‌ మెడిసిన్‌గా పనిచేస్తుంది.
రోజూ ఉదయాన్నే కరివేపాకు ఆకుల్ని నమిలి తినడం వల్ల ఒంట్లో రక్తం శుద్ధి అవుతుంది. పైగా హైబీపి, షుగర్‌ వంటి సమస్యలున్న వారు దీనిని పాటించడం మేలంటున్నారు వైద్యులు. కరివేపాకును సన్నని మంటపై వేయించి పొడిచేసుకుని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
గొంతు సమస్యలకు, లంగ్‌ ఇన్‌ఫెక్షన్లకు అల్లం బాగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే చిన్న సైజు లేత అల్లాన్ని కాల్చి, దాంతో పాటు చిటికెడు ఉప్పుని జోడించి తింటే ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా తోడ్పడుతుంది. అల్లాన్ని ముక్కలుగా కోసుకుని, తడి లేకుండా ఆరబెట్టి ఆ ముక్కల్ని ముందు రోజు రాత్రి తేనెలో నానబెట్టి మరునాడు పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఒక గుడ్డు, పాలు, పెరుగు తప్పక తీసుకోవడం వల్ల వైరస్‌ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవొచ్చు.
ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే, వైరస్‌లు దరి చేరవు. ఒకవేళ చేరినా ఇమ్యూన్‌ సిస్టమ్‌ శక్తివంతంగా ఉంటే వైరస్‌లతో ఫైట్‌ చేయగలదు. అందుకని రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని ఆహారం ద్వారా అందించడమే మేలంటున్నారు వైద్యులు

Tuesday, April 28, 2020

Thursday, April 9, 2020

Wednesday, April 8, 2020

Monday, March 2, 2020

Wednesday, September 11, 2019

Monday, July 23, 2018